వేమన శతకం
వేప రుచులు




           



                                                                  




మన బలం అనేది మన సామర్థ్యం వల్లనా? లేక మన పరిసరాల వల్లనా?

ఈ రోజు “వేమన శతకం వేప రుచులు సీరీస్” లో మనం ఆస్వాదించబోతున్న పద్యం మన జీవనంలోని ఒక గొప్ప సత్యాన్ని అద్దంలా చూపుతుంది.

మన బలం అనేది మన సామర్థ్యం వల్లనా? లేక మన పరిసరాల వల్లనా? వేమన గారు ఈ ప్రశ్నకు అద్భుతమైన ఉదాహరణతో సమాధానం తెలియజేశారు.

ఈ రోజు మనం రుచి చూడబోతున్న “వేప రుచి” , " స్థాన రుచి", అంటే మన స్థానం, పరిసరాలు, పరిస్థితులే మన బలం, మన గర్వానికి మూలం అని గుర్తు చేసే చేదు తీపి మధుర రసయానం ముందుగా మీకు ఈ వేమన శతక పద్యాన్ని చదువుదాం

నీళ్ళ లోన మొసలి నిగిడి యేనుఁగుఁ బట్టు
బైట కుక్క చేత భంగపడును
స్థాన బలిమి గాని తన బలిమి కాదయా
విశ్వదాభిరామ వినుర వేమ!

ఈ పద్యం వేమన గారి వచనాల్లోని శక్తినీ బలాన్ని అద్భుతంగా చూపిస్తుంది. సాధారణంగా మొసలి అనగానే భయానక జీవి మన కంటికి కనిపిస్తుంది. కానీ వేమన గారు దానిలోంచి ఒక తాత్విక నీతిని కనుగొన్నారు బలం అనేది నీ సహజ స్వభావం వల్లనా, లేక నీ స్థానం వల్లనా అని ఆలోచించమని చెబుతున్నారు.

“నీళ్ళలోన మొసలి నిగిడి యేనుఁగుఁ బట్టు” అంటే మొసలి తన స్థలమైన నీటిలో ఉన్నంతవరకు అత్యంత బలవంతురాలు. ఏనుగు లాంటి శక్తివంతమైన జంతువును కూడా నీటిలో అది జయిస్తుంది.

“బైట కుక్క చేత భంగపడును” కానీ అదే మొసలి నేలమీదికి వస్తే చిన్న కుక్కకే లోకువ అవుతుంది. ఎందుకంటే అది తన సహజ స్థలాన్ని కోల్పోయింది. కాబట్టి “స్థాన బలిమి గాని తన బలిమి కాదయా” అనేది ఇది వేమన గారి తాత్విక ప్రశ్న నీ బలం నీదా? లేక నీ స్థానానిదా? నీ బలం నిన్ను నిలబెట్టిందా, లేక నీ పరిసరాలే నిన్ను మోస్తున్నాయా? అని

ఈ పద్యం మనందరికీ ఒక గొప్ప బోధ. ఎవరైనా పెద్ద స్థాయిలో ఉంటే అది పూర్తిగా వారి వ్యక్తిగత బలం కాదు. అవకాశం, సమయం, స్థానం కూడా వారి విజయానికి కారణం.

మనిషి తన స్థానంలో ఉన్నపుడు గర్వపడకూడదు, ఎందుకంటే అది శాశ్వతం కాదు. పరిస్థితి మారితే బలం కూడా మారుతుంది. అందుకే వినయం అనేది బలానికి నిజమైన అలంకారం

ఈ వేమన పద్యం “సజ్జన దుర్జన రసయానం”లోకి వస్తుంది. ఎందుకంటే ఇది మనిషి బలహీనత, గర్వం, వినయం ఇవన్నీ మంచితనం-చెడుతనం యొక్క తేడా ద్వారా చూపిస్తుంది. వేమన గారు చెప్పేది “స్థానం ఉన్నప్పుడే గర్వపడకు, గౌరవం మనసులో ఉంచుకో.” అదే వేప చేదు రుచి. కానీ ఆ చేదులో తీపి రుచి ఏమిటంటే వినయంగా ఉంటేనే స్థానం నిలుస్తుంది.

ఇతిహాసంలో చూస్తే దుర్యోధనుడు కూడా స్థానం వల్ల బలవంతుడు. కానీ ఆ స్థానం పోయిన వెంటనే అతడి గర్వం చిద్రమైంది.

మన సమకాలీన ఉదాహరణగా చూస్తే ఒక పదవిలో ఉన్న అధికారి పదవి ముగిసిన వెంటనే సాదారణ వ్యక్తి అవుతాడు. అందుకే వేమన గారి సందేశం నేటికీ, నేటి సమాజానికీ, నేటి తరానికీ అచ్చం సరిపోతుంది.

ఈ పద్యంలో వేమన గారి శైలి అద్భుతమైన రూపకాల శైలి. “మొసలి ఏనుగు కుక్క” అనే మూడు విభిన్న స్థాయిలతో మనిషి బలం మరియు దౌర్భల్యాన్ని చిత్రీకరించారు. భాష సూటిగా, భావం లోతుగా ఉంటుంది.

ఈ పద్యం "సజ్జన దుర్జన రసయానం" వర్గానికి చెందుతుంది. ఇది మనిషి మంచితనం, గర్వం, వినయం వంటి నైతిక విలువలపై ఆధారపడింది. “బలం ఉన్నవాడికి వినయం ఉండాలి” ఇదే ఈ రసయానపు చేదులోని తీపి రుచి.

నేటి ప్రపంచంలో కూడా మనం చూస్తున్నాం ఒక పదవి లేదా స్థానం కలిగిన వ్యక్తి వినయంగా ఉంటేనే ప్రజలు అతన్ని గౌరవిస్తారు. లేకపోతే ఆ స్థానం పోయిన తర్వాత ఎవ్వరూ చూడరు. ఉదాహరణకు, ఒక ఉద్యోగంలో ఉన్నప్పుడు మన చుట్టూ ఎంతో మంది ఉంటారు. ఆ ఉద్యోగం పోయిన వెంటనే చాలామంది దూరమవుతారు. అది “స్థాన బలం” మాత్రమే, “తన బలం” కాదు. మనిషి స్థానం శాశ్వతం కాదు. కానీ మనసు యొక్క స్థితి, ఆత్మవిశ్వాసం, శాశ్వతం. మన బలం మన లోపలే ఉండాలి, బయట కాదు. అదే వేమన గారి ఆధ్యాత్మిక పాఠం.

ప్రియ మిత్రులారా, ఈరోజు “వేమన శతకం వేప రుచులు” సీరీస్‌లో మనం ఆస్వాదించిన వేమన పద్యం మనిషి బలానికి నిజమైన మూలం ఎక్కడుందో మనసును ప్రశ్నించే తాత్విక దర్పణం. స్థానం, పదవి, సమయం ఇవన్నీ తాత్కాలిక బలాలే. అయితే **ఆత్మబలం** మాత్రమే శాశ్వతమైనది. దానిని నిలుపుకున్నవారే నిజమైన విజేతలు. ఈ రోజు మనం ఆస్వాదించిన “వేప రుచి” స్థాన రుచి. మొదట చేదుగా అనిపించినా, చివరికి మనసుకు మధురమైన పాఠం నేర్పిస్తుంది వినయం ఉన్నచోటే నిజమైన గౌరవం ఉంటుంది. మీ జీవితంలో మీరు అనుభవించిన “స్థానం వల్ల వచ్చిన గర్వం” లేదా “వినయం వల్ల వచ్చిన గౌరవం” గురించి కామెంట్ బాక్స్‌లో పంచుకోండి. మీ ఆలోచన వేరొకరి చీకటిని వెలుగులోకి తెచ్చే దీపమవుతుంది.

ఇకపై, మీరు రాసే ప్రతి కామెంట్ నాకు ఒక కొత్త వేమన వాక్యపు స్ఫూర్తి అవుతుంది. అందుకే, నేను ఒక కొత్త ఆలోచనను మీతో పంచుకుంటున్నాను ఇకమీదట మీ కామెంట్లకు నాలుగు పాదాల పద్య సమాధానం గా వేమన శైలిలో పద్యం గా రిప్లై ఇవ్వబోతున్నాను. ఈ సరికొత్త ప్రయత్నం మీ మాటకు నా పద్యరూప ప్రతిస్పందన. ఇది కేవలం వ్యాఖ్యల మార్పిడి కాదు మన మధ్య జరిగే వేమన తత్త్వ సంభాషణ. తదుపరి ఆదివారం నుండి, ప్రతి వారంవారీగా “వీకాసరి” అను ఉప సీరీస్ ద్వారా మీ నుండి వచ్చిన ఉత్తమమైన కామెంట్లకు వేమన శైలిలో నాలుగు పాదాల పద్య సమాధానాలను వీడియో రూపంలో మీ ముందుకు తీసుకురాబోతున్నాను. “వీకాసరి” అంటే “వీక్షకుల కామెంట్లకు సత్యనారాయణ రిప్లై.” ఇది వేమన తత్త్వానికి మీ మాటలతో నేను అందించే ప్రణామం. మనమందరం కలిసి ఈ వేమన వాక్య రసయానాన్ని పంచుకుంటే మన సమాజం దివ్యప్రకాశంగా మారుతుంది. వెలుగు పంచండి, వేమన వాక్యాలను జీవించండి వేప రుచిని తీపి రుచిగా మార్చుకుందాం.

శుభం భూయాత్! జై శ్రీరామ్!
బండ్ల సత్యనారాయణ
(Vemana Satakam - Vepa Ruchulu)



"వేమన శతకం - వేప రుచులు" వ్యాసాలు ఒక్కో వ్యాసం ఒక్కో పేజీలో ప్రచురించబడు తున్నాయి. ప్రతి పేజీలో ఆ వ్యాస శీర్షికతో ఒకటి లేదా రెండు పదాల థంబ్‌నైల్ బానర్ ఉంటుంది. క్రింద వరుస క్రమంలో ఇతర వ్యాసాల థంబ్‌నైల్స్‌తో పాటు Previous / Next పేజీ పది బానర్లు అందుబాటులో ఉంచాను. థంబ్‌నైల్ పై క్లిక్ చేస్తే మీరు ఆపేజీలకు వెళతారు. ఈ వ్యాసాలు వరుసగా రికార్డ్ చేసి వేమన శతకం - వేప రుచులు " వేమన శతకం " యూట్యూబ్ ఛానల్‌లో కూడా ప్రచురించబడతాయి. చదవడం లేదా వినడం అనేది పాఠకుడి సౌలభ్యానికే ప్రాధాన్యం.


Bandla App Website Image CLICK
Bandla App Website ImageCLICK
Bandla App Website ImageCLICK
Bandla App Website ImageCLICK