విహారి
మనిషి జీవితం ఒక ప్రయాణం. పుట్టుక నుండి మరణం వరకు మనము నడుస్తూనే ఉంటాము. కానీ తీవ్ర విషాదం ఏమిటంటే, నేటి రోజుల్లో చాలా మంది
ఒకే దారిలో, ఒకే ముసలిలో ఒకే వలయంలో కదలకుండా బావిలో కప్పలా బ్రతుకుతున్నారు. వాళ్ళ జీవితానికి వెలుతురు రాకపోవడానికి కారణం అవకాశాలు లేకుండా కాదు చూపు వెలుపలకి వెళ్లే ధైర్యం లేక అనేది అసలు సత్యం. విహారమే జీవితం విహరించేదే తెలుసుకునే మనసు.
విహారం అంటే ప్రయాణం కాదు పునర్జన్మ పిల్లవాడు మొదటిసారి బయట ప్రపంచాన్ని చూసినప్పుడు అతని కళ్లలో ఆశ్చర్యం కనిపిస్తుంది. అదే ఆశ్చర్యాన్ని
పెద్దవయసులో తిరిగి పొందే మార్గం విహారం. విహారం అనేది కొత్త కళ్ళతో ప్రపంచాన్ని చూడటం. మైండ్‌ను రీ-రిసెట్ చేయటం, హృదయాన్ని ప్రశాంతపరచటం, ఆత్మను ఆహ్వానించడం, జ్ఞానాన్ని విస్తరించడం. మనిషి ఇంట్లో ఉన్నపుడు అతని ఆలోచనలు చుట్టూ ఉన్న గోడలతో బంధింపబడతాయి. బయటకు వెళ్లినప్పుడు ఆ గోడలు కూలిపోతాయి. ప్రతి మనిషి విహరిస్తూ బ్రతకాలి అపుడే సమాజపు కట్టుబాట్ల నుండి మనసు విముక్తమవుతుంది. రోజువారీ పనులు, ఒత్తిడులు, బాధ్యతలు మనసును బంధిస్తాయి. విహారం ఆ బంధాలను చెరిపేస్తుంది. పరిచయాలను అధిగమించి ప్రపంచాన్ని చూడగలుగుతాము
సొంత ఊరిలో, సొంత ఇంట్లో ఉంటే మనిషి విషయం అంచనా అదే. కానీ బయట ప్రపంచం చూపించినప్పుడు మన అవగాహన వెయ్యిరెట్లు పెరుగుతుంది. ఆరోగ్యం మెరుగవుతుంది ప్రయాణం అంటే నడక, ఎక్కడం, పర్వతాలు చుట్టడం ఇవి అన్నీ డాక్టర్ రాయకుండా ఇచ్చే ఉత్తమ మెడిసిన్. కొత్త ప్రదేశం, కొత్త గాలి, కొత్త భావన, కొత్త ఉత్సాహం. మనసు ఇందులో పునరుద్ధరణ పొందుతుంది. జ్ఞానం పెరుగుతుంది ప్రతి కొత్త ప్రదేశం ఒక కొత్త పుస్తకమే. చరిత్ర, సాహిత్యం, సంస్కృతి, పురాతన రహస్యాలు విహారం మనకు ఇవన్నీ నేర్పుతుంది.
మనిషి తన జీవితాన్ని మార్చుకోవాలంటే కావలసింది ఒకే ఒక శక్తి ప్రయాణం. ప్రపంచం ఎంత పెద్దదో, మనసు ఎంత విశాలమో, విహారం ద్వారా మాత్రమే తెలుస్తుంది. మనము శ్రమిస్తే మన ఆరోగ్యం బాగుంటుంది. విహరిస్తుంటే మనసు ఉత్తేజమవుతుంది. మనిషి ఇంట్లో ఉండి బ్రతుకుతాడు. ప్రపంచాన్ని చూస్తే మాత్రమే జీవిస్తాడు. చిన్న విహారమైతే మనసుకు శాంతి. పెద్ద విహారమైతే జీవితం itself changes.
నా విశ్రాంత జీవితం ఇపుడు గత మూడు సంవత్సరముల నుండి 2023 సంవత్సరం పిబ్రవరి నుండి ప్రతి నెలా నేను ప్రతి నెలలో ఒక ఐదు ఆరు రోజులు పుణ్యక్షేత్రాలు, తీర్ధ యాత్రలపై ధృష్టి మళ్ళించాను. ఈ పుణ్యక్షేత్రాలు కేవలం దేవాలయాలు కాదు మనసు శిష్యుడయ్యే విశ్వవిద్యాలయాలు. యాత్రలో కాలికి పట్టు వస్తుంది, గుండెకి ధైర్యం వస్తుంది, మనసుకు శాంతి వస్తుంది, బుద్ధికి స్పష్టత వస్తుంది. అందుకే పుణ్యక్షేత్రాలను “తీర్థయాత్రలు” అని అంటారు. అవి హృదయాన్ని తీర్థం లాగా శుద్ధం చేస్తాయి. ఇందులో ఇప్పటి వరకూ
2026 జనవరి 3 తేదీ వరకూ నేను చేసిన అరుణాచలం 30 గిరిప్రదక్షిణలు దీనికి ప్రత్యక్ష సాక్ష్యం. శ్రమ = ఆరోగ్యం = శాంతి తో మనసు ఉత్తేజం పొందుతుంది. ఇవి యాత్రలు మాత్రమే కాదు, ఆత్మకు ఔషధం.
రిటైర్ అయిన తర్వాత మనుషులు చాలామంది ఇళ్లలోనే కూర్చుని శరీరాన్ని బలహీనపరుస్తారు, మనసును అలసటకు గురిచేస్తారు. కానీ నేను రిటైర్మెంట్‌ను జీవిత ముగింపుగా కాదు, జీవితం కొత్త రంగుల ఆరంభంగా మార్చుకున్నాను. ప్రతి నెల 5–6 రోజులు విహారం చేయడం ఇది కేవలం పర్యటన కాదు, ఇది నా అంతరంగ శోధన.
నేను ఈ "విహారి" విభాగంలో రాబోయే నా విహారాలను ప్రదేశ వివరణలతో చిన్న, చిన్న వీడియోలుగా మీ ముందుంచాలని నా ఆకాంక్ష, ఈ “విహారి” అనే ఈ వెబ్ సైట్ విభాగం శీర్షిక బ్లాగులకే కాదు, జీవితానికే ఒక వెలుగుగా, యాత్రకు ప్రేరణ గా ఆధ్యాత్మిక అనుభవాల పంచికగా, ప్రయాణం మనసునిచ్చే పాఠాలుగా, ఆరోగ్యం-మనసు-ఆత్మ త్రయం యొక్క ప్రయాణంగా ప్రతి మనిషి బయటకి రావాల్సిన అవసరంగా ఇవన్నీ ప్రపంచానికి తెలియజేసే ప్రేరణా కేంద్రం గా విహారం అంటే బ్రతకటం కాదు--- వికసించడం. ప్రయాణం చేయండి. ప్రపంచాన్ని చూడండి. మనసుని విస్తరించండి. జీవితాన్ని ఆస్వాదించండి. అదే నిజమైన విహారి జీవితం.
అని తెలియజెప్పడం.
మా పిక్‍నిక్ లు, పర్యటనలు, విహార యాత్రల వీడియోలు ఈ క్రింది బానర్స్ పై క్లిక్ చేసి వీక్షించండి.
ఇవి ఎనిమిది సంవత్సరముల క్రితం నాటి నా విహారాలు కనుకనే అప్పటి నా నాలెడ్జ్ అనుగుణంగా రూపొందించుకున్న వీడియోలు. కాలం మారింది భావం మారలేదు నా విహారాల సత్యం. ఇవి నేటి ప్రయాణాలు కావు. ఎనిమిది సంవత్సరాల క్రితం నేను చేసిన విహారాలు. అప్పటి నా అనుభవం, అప్పటి నా అవగాహన, అప్పటి నా భావనలతోనే నేను ఆ వీడియోలను రూపొందించుకున్నాను. అవి నేటి సాంకేతిక ప్రమాణాలతో పోల్చితే సాధారణంగా కనిపించవచ్చు. కానీ వాటిలో దాగి ఉన్నది ప్రదర్శన కాదు ప్రయాణపు నిజమైన హృదయం. ఆ రోజుల్లో నాకు ఉన్న జ్ఞానం మేరకే నేను నా ప్రయాణాలను అర్థం చేసుకున్నాను.
అప్పటి నా కెమెరా కాదు ముఖ్యమైనది అప్పటి నా మనసు. అప్పటి నా ఎడిటింగ్ కాదు విలువైనది అప్పటి నా అనుభూతి. అప్పటి నా మాటలు కాదు గొప్పవి అప్పటి నా నిశ్చలమైన భక్తి. ప్రతి ప్రయాణం మనిషిని మార్చుతుంది. ప్రతి అడుగు మనిషికి కొత్త దృష్టిని ఇస్తుంది. ఎనిమిది సంవత్సరాల క్రితం నేను చూసిన ప్రపంచం వేరు. ఈ రోజు నేను చూస్తున్న ప్రపంచం వేరు. కానీ ప్రయాణం ఇచ్చిన సారాంశం మాత్రం ఒకటే మనసును విస్తరించుకోవడం.
అందుకే ఆ వీడియోలు కేవలం పాతవి కావు. అవి నా ఆత్మ ప్రయాణానికి తొలి అడుగులు. నా విజ్ఞాన వికాసానికి మొదటి పాఠాలు. నా విహారి జీవితానికి మూలాధారాలు. కాలం మనిషిని మార్చుతుంది. కానీ ప్రయాణం మనిషిని నిర్మిస్తుంది.
అప్పటి నా ప్రయాణాలు ఈ రోజు నా ఆలోచనలకు పునాది. అప్పటి నా వీడియోలు ఈ రోజు నా జీవన దర్శనానికి సాక్ష్యం. ఇవి పాత ప్రయాణాలే అయినా, వాటి విలువ పాతది కాదు. అవి నా జీవితంలో ఒక అధ్యాయం కాదు, నా విహారి జీవితం మొదలైన మొదటి అధ్యాయం.