ఇష్టగీతం
IshtaGeetam




           



పాడు వానిగా మారిన కథ "ఇష్టగీతం" వెనుక ఉన్న ప్రయాణం

నేను స్వతహాగా పాడువానిని కాదు. ఈ మాటను ఎలాంటి సందేహం లేకుండా చెప్పగలను. కానీ ఈరోజు “పాడుతున్నాను” అని చెప్పుకునే స్థితికి వచ్చాను అంటే అది నా జీవితంలో చోటు చేసుకున్న ఒక నెమ్మదైన, కానీ లోతైన మార్పు ఫలితం. ఈ మార్పుకు కారణం ఇద్దరు బాల్య స్నేహితులు. వేర్వేరు రాష్ట్రాల్లో ఒకరు తెలంగాణలో, మరొకరు ఆంధ్రప్రదేశ్‌లో తమ తమ వృత్తుల్లో బిజీగా ఉన్న ఇద్దరు డాక్టర్లు. వాళ్ల వల్ల నేను పాడువానిగా “మారిపోయాను” అని చెప్పడం నాకు అపారమైన సంతోషాన్ని ఇస్తోంది. ఈ సందర్భంలో వారిద్దరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు.



ఒక వాట్సప్ గ్రూప్ ఒక ఆలోచన ఒక మలుపు

నరసరావుపేట మునిసిపల్ హైస్కూల్‌లో చదివిన మా 10వ తరగతి బాల్య మిత్రులందరం చిన్ననాటి జ్ఞాపకాలను పంచుకోవడానికి MHS 10th Group అనే వాట్సప్ గ్రూప్‌ను ప్రారంభించాం. ప్రారంభంలో గ్రూప్ ఎంతో సజావుగా సాగింది. పాఠశాల జ్ఞాపకాలు, ఉపాధ్యాయులు, ఊరి కథలు అన్నీ మళ్లీ మళ్లీ మనసును తాకాయి. కానీ కొంత కాలానికి, గ్రూప్ ఉద్దేశానికి సంబంధం లేని పోస్టులు రావడం మొదలైంది. అలాంటి సందర్భాల్లో ఒక బాల్య మిత్రుడు గ్రూప్ నుండి లెఫ్ట్ కావడం, మళ్లీ జాయిన్ కావడం ఇలా పునరావృతమయ్యేది. ఈ విషయం నన్ను ఆలోచనలోకి నెట్టింది.



మెదడుకు పని ఇవ్వడం ఆరోగ్యానికి బీజం

ఆ మిత్రుడితో ఫోన్‌లో మాట్లాడినప్పుడు తెలిసిన విషయం నా ఆలోచనలకు శ్రీకారం చుట్టింది. చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకోవడం మన మెదడుకు అత్యంత అవసరం. అలా చేయకపోతే మెదడు మొద్దుబారుతుంది. చివరకు మనుషులను కూడా గుర్తుపట్టలేని స్థితికి తీసుకెళ్లే వ్యాధి ఉంది దాన్నే అల్జీమర్స్ అంటారు. ఈ మాటలు నన్ను లోతుగా కుదిపేశాయి. అప్పుడే గ్రహించాను జ్ఞాపకాలను నెమరు వేసుకోవడం కూడా ఒక సాధన అని.



ప్రతిరోజూ వచ్చే ఒక పాట ఒక అలవాటు

ఇంకొక బాల్య మిత్రుడు గత ఆరు సంవత్సరాలుగా, ఒక్క రోజు కూడా విరామం లేకుండా, ప్రతిరోజూ ఉదయం నాకు పాత మెలోడి పాటలు పంపుతున్నారు. మొదట్లో ఆ పాటలను పెద్దగా పట్టించుకోలేదు. ఆపమని కూడా చెప్పలేదు. కానీ అవి నిత్యక్రమంగా వస్తూనే ఉన్నాయి. అప్పుడే నాకు చిన్నప్పుడు చదివిన వేమన శతకంలోని పద్యం గుర్తొచ్చింది “అనగ అనగ రాగ మతిశయిల్లుచు నుండు తినగ తినగ వేము తియ్యగ నుండు సాధనమున పనులు సమకూరు…” సాధన చేస్తేనే ఫలితం వస్తుందన్న సత్యం అర్థమైంది.

పాడడానికి చేసిన మొదటి ప్రయత్నం ఆ పాటలలో ఒకదాన్ని ఎంచుకుని నేను పాడేందుకు ప్రయత్నించాను. మొదట్లో స్వరం సహకరించలేదు. కానీ పట్టు వదలలేదు. మళ్లీ మళ్లీ ప్రయత్నించాను. కొద్ది రోజులకే స్వరం కొంచెం సహకరించడం మొదలైంది. ఇంతవరకు “పాట పాడలేని రాయి” లా ఉన్న నేను ఇప్పుడు “పాట పాడే శిల”గా మారుతున్నానేమో అన్న భావన కలిగింది. అది ఇప్పుడే అందంగా లేకపోయినా, ముందు ముందు మరింత మెరుగుపడుతుందన్న విశ్వాసం నాలో పుట్టింది.

ఒకే దెబ్బకు రెండు పిట్టలు ఈ ప్రయాణంలో నాకు రెండు లాభాలు కలిశాయి
1. పాటలను మళ్లీ మళ్లీ చదవడం వల్ల జ్ఞాపకశక్తి పెరగటానికి అవకాశం వచ్చింది
2. చూడకుండా పాడే ప్రయత్నంతో మెదడుకు మంచి పని దొరికింది ఇది నా జీవనశైలిలో వచ్చిన అందమైన మార్పు.

“ఇష్టగీతం” ఒక భావన, ఒక ప్రయాణం

ఇలా పుట్టిందే “ఇష్టగీతం | IshtaGeetam” . ఇది పోటీ కోసం కాదు, ప్రదర్శన కోసం కాదు, మనసుకు నచ్చిన పాటలను సాధనతో, శ్రద్ధతో, ఆనందంతో పాడి పంచుకునే ఒక చిన్న ప్రయత్నం మాత్రమే.



అందమైన జీవితం మన చేతుల్లోనే

జీవితం గతంలో ఎలా జరిగిందన్నది ముఖ్యం కాదు. ముందు ఎలా సాగాలనుకుంటున్నామన్నదే ముఖ్యం. చిత్రలేఖనం కావచ్చు, పాటలు కావచ్చు, కవితలు కావచ్చు, వ్యాసాలు కావచ్చు ఏదైనా ఒక కొత్త వ్యాపకానికి స్వాగతం పలికితే మన శేష జీవితం మరింత అందంగా మారుతుంది. ఈ మార్పుకు కారణమైన నా బాల్య మిత్రులిద్దరికీ పేరు పేరునా మరోసారి కృతజ్ఞతలు.

ఈ వ్యాసాన్ని ఓపికగా చదివిన మీ అందరికీ హృదయపూర్వక అభివందనాలు.

“ఇష్టగీతం” ద్వారా నా చిన్న సంగీత ప్రయాణాన్ని మీతో పంచుకుంటూ.... మరో సందర్భంలో మళ్లీ కలుద్దాం.

శలవు నమస్తే
బండ్ల సత్యనారాయణ



"ఇష్టగీతం" వ్యాసాలు ఒక్కో వ్యాసం ఒక్కో పేజీలో ప్రచురించబడు తున్నాయి. ప్రతి పేజీలో ఆ వ్యాస శీర్షికతో ఒకటి లేదా రెండు పదాల థంబ్‌నైల్ బానర్ ఉంటుంది. క్రింద వరుస క్రమంలో ఇతర వ్యాసాల థంబ్‌నైల్స్‌తో పాటు Previous / Next పేజీ పది బానర్లు అందుబాటులో ఉంచాను. థంబ్‌నైల్ పై క్లిక్ చేస్తే మీరు ఆపేజీలకు వెళతారు. ఈ వ్యాసాలు వరుసగా రికార్డ్ చేసి " ఇష్టగీతం " యూట్యూబ్ ఛానల్‌లో కూడా ప్రచురించబడతాయి. చదవడం లేదా వినడం అనేది పాఠకుడి సౌలభ్యానికే ప్రాధాన్యం.


Bandla App Website Image CLICK
Bandla App Website ImageCLICK
Bandla App Website ImageCLICK
Bandla App Website ImageCLICK