వేమన శతకం
వేప రుచులు




           



                                                                  




సాధనమున బనులు సమకూరు ధరలోన

మహాకవి వేమన గారి పద్యాలు చాలా సాదాసీదాగా ఉంటాయి కానీ వాటి భావాలు లోతైన బోధనలతో ఉంటాయి. ప్రతి పద్యం ఒక జీవన సూత్రం. అది కేవలం మాట కాదు, అనుభవాల సారం. అందులోని గొప్ప సందేశాలు మన జీవితాన్ని మార్చగల శక్తి కలది. అయితే మనమందరం, ప్రతి ఒక్కరూ కూడా జీవితంలో ఒకదానిని కోరుకుంటాం అది ఏమిటీ అంటే, విజయం. అది సాధించాలంటే ఒక్క మార్గం ఉంది, అదే సాధన. ఈ రోజు మనం చూసే మహాకవి వేమన గారి వేమన శతకం పద్యం “అనఁగ ననగ రాగ మతిశయిల్లుచునుండు…” ఒక జీవన మంత్రంలా ఉంటుంది. ఈ పద్యంలొ వేమన గారు చెప్పేది సాధన గురించి, ఆచరణ గురించి, మన జీవితానికి వేప ఆకుల మాదిరిగానే మొదటి సారి మనం వేపాకును తింటే అది మొదట్లో తీవ్రమైన చేదు రుచి తో ఉంటుంది. అయితె తినగ తినగ తర్వాత అది మాధుర్యంగా మారటం గురించి. ఈ చిన్న పద్యంలోనే జీవితంపై పెద్ద మాటలు ఉన్నాయి. అందుకే నేను ఈ రోజు ప్రారంభించే ఈ సీరీస్ “వేప రుచులు ” లో మొదటి పద్యంగా ‘అనఁగ ననగ రాగ మతిశయిల్లుచునుండు...’ అనే ఈ మహోన్నత పద్యాన్ని మీతో పంచుకుంటున్నాను.

అనఁగ ననగ రాగ మతిశయిల్లుచునుండు
తినఁగ దినఁగ వేము దీయనుండు
సాధనమున బనులు సమకూరు ధరలోన
విశ్వదాభిరామ వినుర వేమ!

వేమన గారు ఇక్కడ ఒక మహద్భావాన్ని చెప్పారు. పాట పాడుతూ పాడుతూ ఉంటే రాగం పెరుగుతుంది. అదేవిదంగా వేప ఆకును తింటూ తింటూ ఉంటే వేప చేదు కూడా తియ్యగా అనిపిస్తుంది. అదే విధంగా ఏ పనినైనా నిరంతర సాధన చేస్తే, మొదట్లో కష్టంగా, చేదుగా అనిపించినా, తరువాత అది సులభమవుతుంది, రుచికరమవుతుంది, ఆత్మసుఖమవుతుంది. ఇది కేవలం ఒక పద్యం కాదు, ఒక జీవన మంత్రం. వేమన గారి ఈ పద్యం మనకు ఒక అద్భుతమైన పాఠం నేర్పుతుంది, ఏమిటీ అంటే “సాధన చేస్తూ ఉంటే అసాధ్యమని అనుకున్నదీ సాధ్యం అవుతుంది.”

మొదటగా మనం ప్రారంభించే ప్రతి ప్రయత్నం కష్టంగా ఉంటుంది సంగీతం నేర్చుకోవడం, పఠనం, వ్రాయడము, యోగాసనాలు, వ్యాయామం, నడవడం లేదా ఆధ్యాత్మిక మార్గము. మొదట చేదుగా, నొప్పిగా, నిరుత్సాహంగా అనిపిస్తుంది. కానీ, దానిని విడిచిపెట్టకుండా సాధనతో కొనసాగిస్తే, అదే కష్టం తరువాత మన బలం అవుతుంది. చేదు రుచే తరువాత తీయగా మారుతుంది.

మనకు విజయం వరించాలి అంటే కోరిక మాత్రమే కాకుండా, కృషే అవసరం. ఓపిక అవసరం, ఏ పని తక్షణ ఫలితం ఇవ్వకపోవచ్చు. ఓపికతో సాధన చేయాలి. ప్రతి రోజు కొంచెం ప్రయత్నం చేస్తూ ఉంటే అది పెద్ద మార్పు చేసి చూపుతుంది. సాధన ప్రారంభించిన మొదటి రోజుల్లో ఇది నాకు సాధ్యం కాదు అని అనుకున్నవారుకూడా సాధనను నిలిపి వేయకుండా సాధన చేస్తూ వుంటే విషయాలు రోజుకి రోజు సాధ్యంగా అనుకూలంగా విజయ దిశకు మారతాయి.

ఈ విలువలు మన విద్యార్థులకి, యువతకి ముఖ్యము. సాధన చేయటం నిలపకుండా, ప్రతిరోజూ కొద్దిగా సాధన చేస్తే విజయానికి దారితీస్తుంది. వేమన గారి ఈ పద్యం మనకు చెబుతోంది ఏమిటీ అంటే “విజయానికి shortcut అంటూ ఏదీ లేదు, సాధన చేయడమే shortcut. విజయానికి దగ్గరి దారి సాధన చేయడం” ప్రాచీన భారతీయ సంస్కృతిలో ప్రతి మహానుభావుడూ “సాధన” ద్వారానే ఉన్నతములోకి ఎదిగారు. వాల్మీకి, నారదుడు, వివేకానందులు, అందరూ సాధన ద్వారా అభిమానస్థాయికి చేరుకున్నారు. వాల్మీకి ఆకస్మికంగా కాదు, జప సాధన ద్వారానే మారి వాల్మీకి అయ్యాడు శ్రీ రామాయణం వ్రాశారు . నారదుడు కూడా సాధన ద్వారానే సంగీత బ్రహ్మ అయ్యాడు, శ్రీరాముడి అశ్వమేధ యజ్ఞం కూడా సాధనతోనే సాధ్యమైంది. వారి జీవితం ధర్మ ప్రయోగం, కృషి, బాధ్యతతో నిండి ఉంది. ఈ పద్యం ద్వారా వేమన గారు కూడా మనకు చెబుతున్నది: “మహాత్ముల మార్గం ఒక్కటే, అది సాధన.”

వేమన గారి పద్యాలు చక్కని ఉపమానాలతో నిండివుంటాయి. ఇక్కడ ఆయన రాగం మరియు వేప రుచిని ఉదాహరణలుగా తీసుకున్నారు. ఇవి రెండూ మనకు రోజువారీ అనుభవాలు, అందుకే ఆయన మాటలు మన మనసును తాకుతాయి. “వేప చేదు కూడా తినగా తినగా తీయగా అనిపిస్తుంది” అనే మాటతో ఆయన ఒక గొప్ప ఆత్మ జ్ఞానాన్ని చెబుతున్నారు. ఇది వేమన గారి శైలిలోని మహత్తు, సాధారణ జీవితాన్ని ఆధ్యాత్మికతతో మిళితం చేసి చెప్పడం.

ఈ పద్యం మానవుని ఆత్మ, శ్రమ, మరియు ప్రగతి మధ్య ఉన్న సంబంధాన్ని చెబుతుంది. ఈ “వేప రుచులు” సీరీస్ యొక్క ప్రధాన ఆలోచన కూడా ఇదే, మొదట చేదుగా అనిపించిన జీవన రుచులు, సాధనతోనే తీయని అనుభవాలుగా మారుతాయి. ఇదే మన జీవిత యాత్ర యొక్క తత్త్వం. నేడు మనం యూట్యూబ్, సోషల్ మీడియా, లేదా ఏ రంగంలోనైనా ఎదగాలి అంటే, సాధన లేకుండా కుదరదు. నేను కూడా నా ఈ యూట్యూబ్ “వేమన శతకం” ఛానల్ ప్రారంభించినప్పుడు, నా వాయిస్ బొంగురుగా ఉండేది, నా వీడియో నాణ్యత సాధారణంగా ఉండేది. రోజు రోజుకు సాధనతో, ప్రయత్నంతో, ప్రాక్టీస్‌తో, నా వాయిస్ మెల్లగా శ్రావ్యంగా మారింది. నా వీడియోలు నాణ్యత పెరిగాయి. నా భక్తి భావం మరింత బలపడింది. ఈ ప్రయాణం వేమన గారి ఈ పద్యం లానే నాకు మొదట చేదుగా, తరువాత తియ్యగా! మారింది

సాధన అనేది కేవలం శారీరక ప్రయత్నం కాదు, అది ఆత్మ శుద్ధి. మనసు ఒక వేపచెట్టు లాంటిది చేదుగా ఉంటుందేమో కానీ, దాని రసమే మన ఆరోగ్యానికి ఔషధం. అదే విధంగా, మన కష్టాలు, మన సాధనలు, మన మనసును తీయగా మార్చే ఔషధం. ఈ పద్యం మనకు చెబుతున్నది సాధన అనేది భగవత్ సేవలో మొదటి మెట్టు. ప్రియమైన మిత్రులారా, నేను ఈ వీడియోను “వేప రుచులు” సీరీస్‌లో మొదటి వీడియోగా ఎంచుకున్నానంటే, దానికి ఒక లోతైన కారణం ఉంది. ఎందుకంటే, వేమన గారి మాటల్లోనే వేప రుచులు తియ్యగా అనిపించే సాధనతత్త్వం దాగి ఉంది. ఇదే నా ప్రయాణానికి ఆరంభం, ఇది నేను మీతో పంచుకుంటున్న భక్తి బంధం.

మీరు కూడా ఏ పనినైనా ప్రారంభించండి, అది పాటా అయినా, చదువు అయినా, వాక్పటుత్వం అయినా, యోగా లేదా ధ్యానం అయినా సరే. మొదట అది కష్టం గా, ఉంటుంది కానీ నిరంతర సాధన దీన్ని మీ కోరికను బలంగా మార్చి, అది మీ జీవన భాగమవుతుంది. ఆరంభంలో చేదుగా ఉన్నా భయపడకండి. సాధన కొనసాగించండి, ఫలితం తియ్యగా మారుతుంది. అందుకే వేమన గారి మాటల్లో చెప్పాలంటే, “సాధనమున బనులు సమకూరు ధరలోన.” సాధన చేసినవారే జీవిత యజమానులు, విజేతలు.

శుభం భూయాత్! జై శ్రీరామ్!



"వేమన శతకం - వేప రుచులు" వ్యాసాలు ఒక్కో వ్యాసం ఒక్కో పేజీలో ప్రచురించబడు తున్నాయి. ప్రతి పేజీలో ఆ వ్యాస శీర్షికతో ఒకటి లేదా రెండు పదాల థంబ్‌నైల్ బానర్ ఉంటుంది. క్రింద వరుస క్రమంలో ఇతర వ్యాసాల థంబ్‌నైల్స్‌తో పాటు Previous / Next పేజీ పది బానర్లు అందుబాటులో ఉంచాను. థంబ్‌నైల్ పై క్లిక్ చేస్తే మీరు ఆపేజీలకు వెళతారు. ఈ వ్యాసాలు వరుసగా రికార్డ్ చేసి వేమన శతకం - వేప రుచులు " వేమన శతకం " యూట్యూబ్ ఛానల్‌లో కూడా ప్రచురించబడతాయి. చదవడం లేదా వినడం అనేది పాఠకుడి సౌలభ్యానికే ప్రాధాన్యం.


Bandla App Website Image CLICK
Bandla App Website ImageCLICK
Bandla App Website ImageCLICK
Bandla App Website ImageCLICK