ప్రియ మిత్రులారా ! మీ అందరికీ ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు
నాకు ఎంతో సంతోషం, ఆనందం కలిగించింది, నా క్రొత్త సీరీస్ “వేమన శతకం - వేప రుచులు”. ఈ సిరీస్ ప్రారంభమైన కొన్ని గంటల్లోనే, 900 మందికిపైగా వీక్షించారు. అది సంఖ్య కాదు, అది నాకు మద్దతు. మీ ప్రేమ, మీ ఆసక్తి, నా సాధనకు మీరు అందజేస్తున్న ప్రోత్సాహం.
ఈరోజు నేను చెప్పబోయే విషయం, “ఈ వేప రుచులు అంటే ఏమిటి?”, “వేమన శతకం తో దీని సంబంధం ఏమిటి?” అనే ప్రశ్న చాలామందికి వచ్చింది.
ఒక మిత్రుడు ఫోన్ చేసి అడిగారు, “సత్యనారాయణ , వేమన శతకం అర్థమైంది, కానీ ‘వేప రుచులు’ అంటే ఏమిటి?” ఆ ప్రశ్నకు నేను ఫోన్‌లో చెప్పిన సమాధానాన్ని ఈ వీడియో ద్వారా మీ అందరికీ పంచుకుంటున్నాను. "వేప రుచులు అంటే ఏమిటి?" అనే మీ సందేహానికి నా సమాధానము. వేమన శతకం పద్యాలు మన సమాజానికి ఒక చికిత్సలాంటివి. అవి కాస్త చేదుగా అనిపిస్తాయి, కానీ చివరికి మనసును శాంతింపజేస్తాయి. సమాధానపర్చుతాయి.
మహా కవి వేమన గారి మాటలు వేప ఆకుల్లా ఉంటాయి, అవి మొదట చేదుగా అనిపించినా, ఆ చేదులోనే జీవన మాధుర్యం దాగి ఉంటుంది. అందుకే నేను ఈ సీరీస్‌కి పేరు పెట్టాను, “వేమన శతకం - వేప రుచులు.” అని
“వేమన” అనే పేరులోని “వే” అక్షరం, “పద్యము” అనే పదంలోని “ప” అక్షరం, ఈ రెండు కలిస్తే “వేప.” "వేప రుచులు" అంటే వేమన పద్య రుచులు. ఇది కేవలం పేరు కాదు, ఒక తత్త్వం. ప్రతి వేమన పద్యం ఒక రుచి, ఒక బోధ, ఒక రసయానం. వేమన గారు మనిషి స్వభావాన్ని వివిధ కోణాల్లో దర్శింపజేస్తున్నారు. విశ్లేషిస్తున్నారు. పరీక్షిస్తున్నారు,
ఒక పద్యంలో ధర్మం, మరొకదానిలో భక్తి, ఇంకొకదానిలో నైతికతను వెల్లడిస్తున్నారు.
ప్రతి పద్యం ఒక రుచి, ప్రతి రుచి ఒక పాఠం. సాధన రసయానం, సాధకుల జీవితం.
మరో ఒక మిత్రుడు ఫోన్‌లో అడిగారు, “వేమన పద్యాల్లో సాధనకు సంబంధం ఏమిటి?” అని అందుకు మన సమాధానం ’సాధనమున బనులు సమకూరు ధరలోన" అను వేమన మాటలతో కూడా చెప్పవచ్చు , ఏ శ్రేయస్సు అయినా, ఏ విజయమయినా, "సాధన లేకుండా సాధ్యం కాదు." అని. వేమన గారి ప్రతి పద్యంలో ఒక సాధన దాగి ఉంది, మనసుని మెరుగుపరచే సాధన, ఆచరణలోకి తీసుకువెళ్ళే సాధన. ఇదే సాధన రసయానాన్ని మనం చరిత్రలో, మహానుభావుల జీవితాల్లో చూస్తాం.
ఉదాహరణకు మన మాజీ రాష్ట్రపతి, విఖ్యాత శాస్త్రవేత్త అబ్దుల్ కలాం గారు, సాధారణ విద్యార్థిగా మొదలై, నిరంతర సాధనతో "భారతరత్నం" అయ్యారు.
అది కేవలం విజ్ఞాన సాధన కాదు, ఆత్మ నియంత్రణ, క్రమశిక్షణ, వినయం. అదే వేమన గారి సూత్రం, “సాధన చేస్తే అసాధ్యమన్నది కూడా సుసాధ్యం అవుతుంది.” అని
ఈ సందర్భంలో మనకు, మన సమాజానికి ఎంతో గౌరవం కలిగిస్తున్న సాధన రసయానాన్ని జీవించిన నా ఇద్దరు బాల్య మిత్రుల గురించి మీతో ప్రస్తావించాలని అనుకుంటున్నాను. ఈ ఇరువురి జీవితం వేమన పద్యాల సారాంశానికి సజీవ ఉదాహరణలు.
ఈ ఇరువురిలో ఒకరు, సయ్యద్ నశీర్ అహమ్మద్ గారు మరొకరు శ్రీ వేదాంతం సీతారామావధాని గారు.
శ్రీ సయ్యద్ నశీర్ అహమ్మద్ నరసరావుపేట శ్రీ సుబ్బరాయ & నారాయణ కళాశాలలో బికాం పూర్తి చేసి, తర్వాత ఎం.కాం చేశారు, ఆ తరువాత న్యాయశాస్త్రంలో లా డిగ్రీ. ఆ క్రమంలో మరెన్నో డిగ్రీలను ఆయన సంపాదించారు. గుంటూరు ప్రభుత్వ ట్రెజరీ శాఖలో ఉద్యోగం వచ్చినా, అయనకు ట్రెజరీ కార్యలయ కాగితాల రాతల కంటే చరిత్ర రాతలే పట్ల మక్కువ ఎక్కువని తెలుసుకున్నారు. ఆ ఉద్యోగాన్ని వదిలి, మరికొన్ని వృత్తులు వదలి, గత ముప్పై సంవత్సరాలుగా, "భారత స్వాతంత్ర్య సంగ్రామంలో ముస్లింల పాత్ర" అనే ఏకైక చారిత్రక అంశాన్ని తీసుకుని నిరంతర పరిశోధన చేస్తున్నారు.
ఆ అన్వేషణ, పరిశోధన, విశ్లేషణ కారణంగా 25 పరిశోధనాత్మక చరిత్ర గ్రంథాలు రచించారు, ఇంకా వ్రాస్తూనే ఉన్నారు. ఈ విజయం ఒక నిత్య సాధకుని అనునిత్య జీవిత సాధనకు అత్యున్నత ఉదాహరణ. ఇది కేవలం రచన కాదు . మన భారతదేశ చరిత్రలో ఒక మౌన విప్లవం. మిత్రుడు నశీర్ అహమ్మద్ రాసిన పలు గ్రంథాలు ఇప్పటి వరకు ఆరు భాషల్లో అనువదించబడి వెలువడటం విశేషం. ఆ కారణంగా ఆయన చరిత్ర గ్రంథాలు ప్రాంతీయ, జాతీయ సరిహద్దులు దాటి అంతర్జాతీయ స్థాయిలో ప్రాముఖ్యతను సంపాదించుకుని గుర్తింపును పొందాయి, పొందుతున్నాయి. ఈ విజయం వెనక అవిశ్రాంత కృషి, పట్టుదల, నిరంతర సాధన ప్రధాన సాధనాలు.
ఈ నిరంతర సాధన మనకు నేర్పేది ఏమిటంటే, సేవా దృక్పథం గల మనసు అనె నిరంతర సాధన ఉంటే సమయం తెలియదు. జీవితం సేవలతోనే, సాధనలతోనే దారిన పడుతుంది. నిజమైన సాధన ఎప్పుడూ నిశ్శబ్దంగానే ప్రపంచాన్ని జయిస్తుంది. వర్తమానాన్ని ప్రగతి దిశగా మారుస్తుంది, నడిపిస్తుంది.
నా మరో బాల్య మిత్రుడు, శ్రీ వేదాంతం సీతారామావధాని గారు ఒక సామాన్య కుటుంబం నుండి, తన నిరంతర కృషి, పట్టుదల, నిబద్ధతతో న్యాయశాస్త్రంలో విశిష్ట ప్రతిభ కనబరిచారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి బంగారు పతకాలు సాధించి, రెండు సంవత్సరాల పాటు నరసరావుపేటలో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. ఆ తర్వాత జిల్లా జడ్జి నుండి మొదలుకుని, అనునిత్య ప్రమోషన్లతో అంచెలంచెలుగా ఎదుగుతూ, చివరకు చేరుకున్నారు మన అత్యున్నత న్యాయస్థానం భారత సుప్రీం కోర్ట్ రిజిస్ట్రార్, ఆ తర్వాత సుప్రీం కోర్ట్ సెక్రటరీ జనరల్ స్థాయికి చేరుకుని అత్యుత్తమ బాధ్యతలు నిర్వహించి చరిత్ర సృష్టించారు. సుప్రీం కోర్టు లా జర్నల్ కు సంపాదకులుగా సేవలు అందించారు.
ఈ క్రమంలో జాతీయ స్థాయి సరిహద్దులు దాటి అంతర్జాతీయంగా కూడా ఖ్యాతి గడించిన అవధాని పాలు దేశాలలో సాగిన విదేశీ న్యాయ సదస్సుల్లో భారత న్యాయ వ్యవస్థకు ప్రతినిధిగా పాల్గొన్నారు. ఈ నాటికి ఆయన న్యాయవాద సేవల్లో నిమగ్నమై ఉన్నారు. ఒక చిన్న పట్టణం అయిన నరసరావుపేట నుండి, భారత సుప్రీం కోర్ట్ వరకు చేసిన ఈ ప్రయాణం సాధన ద్వారా సాధ్యమయ్యింది.
నా మిత్రుల ఈ విజయాలు కేవలం వ్యక్తిగత విజయాలు కాదు. నిరంతర, అవిశ్రాంత శ్రమ, సాధనకు లభించిన అత్యుత్తమ ఫలితం. వేమన పద్యాలలోని వేమన గారి మాటలు, సూక్తులు, సూత్రాలు, కష్టాలతో శ్రమించిన సాధనలను కాంతిగా మారుస్తాయి!
ఈ ఇద్దరు మిత్రులు చూపించారు, "సాధన అంటే కష్టం కాదు, కష్టాన్ని తీపి ఫలితంగా మార్చడం.’ అని వేమన గారు కూడా అదె చెప్పారు, “తినఁగ దినఁగ వేము దీయనుండు, సాధనమున బనులు సమకూరు ధరలోన.” వేప రుచి మొదట చేదు, కానీ చివరికి ఆరోగ్యం. అదే సాధన రుచి, మొదట కష్టం, చివరికి కాంతి.
ప్రియ మిత్రులారా, ఈ “వేమన శతకం - వేప రుచులు” సీరీస్‌లో నేను మీతో పంచుకుంటున్నది కేవలం వేమన పద్యాలు కాదు, జీవన మార్గం, సాధన తత్త్వం, ఆచరణ రసయానాలు. ప్రతి మనిషిలోనూ ఒక వేమన పద్యం రుచి దాగి ఉంటుంది. ఆ రుచి కొన్నిసార్లు వేప చేదులా అనిపిస్తుంది, కానీ మనం ఆ చేదును తీపిగా మార్చగలిగితే
అదే జీవన విజయం, అదే సాధన సారం. మీ జీవితంలో మీరు అనుభవించిన “ఆ చేదు నుంచి తీపి మార్పు” అనుభవం ఉంటే, దాన్ని కామెంట్ బాక్స్‌లో పంచుకోండి.
మీ మాట మరొకరి చీకటిని వెలుగులోకి తెచ్చే దీపమవుతుంది.
మనం అందరం కలిసి వెలుగులు పంచుకుంటే, మన సమాజం దివ్యప్రకాశంగా మారుతుంది. వెలుగు పంచండి… వేమన వాక్యాలను జీవించండి… వేప రుచిని తీపి రుచిగా మార్చుకుందాం.
శుభం భూయాత్! జై శ్రీరామ్!
"వేమన శతకం - వేప రుచులు" వ్యాసాలు ఒక్కో వ్యాసం ఒక్కో పేజీలో ప్రచురించబడు తున్నాయి. ప్రతి పేజీలో ఆ వ్యాస శీర్షికతో ఒకటి లేదా రెండు పదాల థంబ్‌నైల్ బానర్ ఉంటుంది. క్రింద వరుస క్రమంలో ఇతర వ్యాసాల థంబ్‌నైల్స్‌తో పాటు Previous / Next పేజీ పది బానర్లు అందుబాటులో ఉంచాను. థంబ్‌నైల్ పై క్లిక్ చేస్తే మీరు ఆపేజీలకు వెళతారు. ఈ వ్యాసాలు వరుసగా రికార్డ్ చేసి వేమన శతకం - వేప రుచులు " వేమన శతకం " యూట్యూబ్ ఛానల్‌లో కూడా ప్రచురించబడతాయి. చదవడం లేదా వినడం అనేది పాఠకుడి సౌలభ్యానికే ప్రాధాన్యం.