స్నేహాలు కాలం చెరగని ముద్రలు
మనిషి జీవితంలో చాలా విషయాలు కాలంతో మారిపోతాయి. ఊరు మారుతుంది, వృత్తి మారుతుంది, జీవన విధానం మారుతుంది. కానీ కొన్ని మాత్రం కాలానికి లొంగవు. అవే నిజమైన స్నేహాలు. నా నరసరావుపేట స్నేహితులు నాకు కేవలం పరిచయాలు కాదు, బంధువులు కాదు నా జీవిత పుస్తకంలో బంగారు అక్షరాలతో రాసుకున్న అధ్యాయాలు. ఆ అక్షరాలను కాలం చెరపలేదు, పరిస్థితులు మసకబార్చలేదు.
ఆ రోజుల్లో ఉన్న స్నేహం చాలా సాదాసీదా, కానీ చాలా లోతైనది. స్వార్థం లేని ప్రేమ, లెక్కలేని ఆప్యాయత. పగలు రాత్రి తేడా లేకుండా కలిసే తిరుగుడు. ఏమీ లేని రోజుల్లో కూడా కలిసి నవ్వడం, చిన్న విషయాలకే గొడవ పడటం, కానీ పెద్ద మనసుతో వెంటనే క్షమించుకోవడం. ఇవన్నీ పుస్తకాలలో చదివే కథలు కావు తిరిగి రాని అనుభవాలు.
నరసరావుపేటలో పెరిగిన స్నేహాలు ఒక ప్రత్యేకమైన మట్టిలో పుట్టాయి. అక్కడ స్నేహం అంటే అవసరాల మీద ఆధారపడేది కాదు. ఎవరు ఏమయ్యారు అనే ప్రశ్నే ఉండేది కాదు. ఎవరు మనవాళ్లు అన్నదే ముఖ్యం. ఒకరి ఇంటి తలుపు ఇంకొకరికి ఎప్పుడూ తెరిచే ఉండేది. ఆ స్నేహంలో ధనిక పేద, తెలివి అమాయకత్వం అనే తేడాలు లేవు. అందరూ ఒక్కటే.
కాలం గడిచింది. జీవితం అందరినీ వేర్వేరు దారుల్లో నడిపించింది. కొందరు జర్నలిస్టులు అయ్యారు, కొందరు డాక్టర్లు, లాయర్లు, ఉపాధ్యాయులు, చార్టర్డ్ అకౌంటెంట్లు, యూట్యూబర్లు అయ్యారు. ఎవరు ఎక్కడ ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నా మనసులో మాత్రం ఇంకా నరసరావుపేట బాల్య స్నేహితులుగానే ఉన్నారు. పదవులు మారాయి, పేర్లు పెరిగాయి, కానీ మన మధ్య దూరం పెరగలేదు.
ఇప్పటికీ “అరే, ఒరే” అనే పిలుపు అలాగే ఉంది. ఫోన్ ఎత్తగానే “బాగున్నావా సత్యం?” అనే ఆప్యాయత అలాగే ఉంది. ఎంత పెద్ద లాయర్ అయినా, ఎంత బిజీ డాక్టర్ అయినా “మన మధ్య అండీలు, గండీలు ఉండకూడదు, మనం మనమే” అని హితబోధ చేసే మాటలు వినిపిస్తూనే ఉంటాయి. ఆ మాటల్లో అధికార గర్వం లేదు, విజయం మత్తు లేదు, ఉన్నది ఒక్కటే, స్నేహపు నిజాయితీ.
బిజీ జీవితాల్లో మునిగిపోయినా, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ నిర్మించినా, ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నా, ప్రభుత్వ కార్యాలయాల ఒత్తిళ్ల మధ్య ఉన్నా అప్పుడప్పుడూ వచ్చే ఒక ఫోన్ కాల్ మనసును వెనక్కి తీసుకెళ్తుంది. చిన్ననాటి నవ్వులు, పాత జ్ఞాపకాలు, అదే పాత పలకరింపు. ఆ క్షణంలో పదవులు కరిగిపోతాయి, వయసు తగ్గిపోతుంది. మిగిలేది బాల్య స్నేహమే.
స్నేహం అంటే కలిసి ఉండడం మాత్రమే కాదు. కలిసి ఎదగడం. ఒకరి విజయంలో ఇంకొకరు ఆనందపడటం. ఒకరి బాధలో ఇంకొకరు మౌనంగా నిలబడటం. జీవితంలో ఎవరు ఎక్కడికి వెళ్లినా, వెనక ఎవరున్నారు అన్న ధైర్యం ఇవ్వడం. నా నరసరావుపేట స్నేహితులు నాకు అదే ధైర్యం ఇచ్చారు. అందుకే జీవితం ఎన్ని పరీక్షలు పెట్టినా, ఒంటరితనం అనిపించలేదు.
ఈ రోజున విశ్రాంత జీవితం వైపు అడుగులు వేస్తున్నప్పుడు కూడా, స్నేహాలు కొత్తగా వికసిస్తున్నాయి. “మిత్రాలయం” అనే ఒక చిన్న వేదిక ద్వారా మళ్లీ కలిసిన మనసులు, మళ్లీ పంచుకుంటున్న జ్ఞాపకాలు. వయసు పెరిగినా, మనసు మాత్రం తగ్గలేదు. ఈ దశలో స్నేహం మరింత విలువైనదిగా అనిపిస్తోంది, ఎందుకంటే ఇది అవసరాల కోసం కాదు, ఆత్మీయత కోసం నిలిచింది.
కాలం మనల్ని వేరు వేరు చోట్ల నిలబెట్టినా, ఒకే ఊరి జ్ఞాపకం మనల్ని ఒకే దారంలో కట్టిపడేస్తోంది. నరసరావుపేట అనే మాట వినగానే మనసు ఒక్కసారిగా దగ్గరైపోతుంది. అక్కడి వీధులు, అక్కడి ముఖాలు, అక్కడి పిలుపులు, ఇవన్నీ మన మధ్య కనిపించని బంధంగా పనిచేస్తున్నాయి. అదే నిజమైన స్నేహపు బలం.
ఈ స్నేహాలు నాకు ఒక విషయం నేర్పాయి, జీవితంలో ఎంత సంపాదించినా, ఎంత సాధించినా, చివరికి మనతో పాటు నిలిచేది మనుషులే. డబ్బు తగ్గవచ్చు, పేరు మసకబారవచ్చు, కానీ నిజమైన స్నేహం మాత్రం నిలబడుతుంది. అది మనసులో ఒక ఆశ్రయం లాంటిది. అలసినప్పుడు వాలుకునే చోటు.
“నరసరావుపేట జ్ఞాపకాలు”లో ఈ స్నేహాల గురించి రాయడం నా అదృష్టం. “మనోధ్వని”లో ఈ స్నేహాల గురించి మాట్లాడటం నా బాధ్యత. ఎందుకంటే ఇవి కేవలం నా కథలు కాదు, ఈ తరం మర్చిపోతున్న విలువలకు సాక్ష్యాలు. స్నేహం అంటే ఏమిటో చెప్పే జీవంత ఉదాహరణలు.
చివరగా చెప్పాలంటే స్నేహాలు కాలం చెరగని ముద్రలు. అవి మన ముఖంపై కనిపించవు, కానీ మన నడకలో కనిపిస్తాయి. మన మాటల్లో వినిపిస్తాయి, మన మౌనంలో నిలబడతాయి. నా జీవితంలో ఆ ముద్రలు నరసరావుపేట స్నేహితులు. ఎక్కడున్నా, ఎలా ఉన్నా మనసులో మాత్రం ఎప్పటికీ ఒకేలా, ఒకే చోట.