డాక్టర్ బందా జవహర్



Dr Banda Jawahar

ఏడుస్తూ పుడతాం, పోతూ ఏడిపిస్తాం

ఏడుస్తూ పుడతాం, పోతూ ఏడిపిస్తాం - ప్రతి ఒక్కరి జీవితంలో ఈరెండు ఘట్టాలు తప్పనిసరి. అయితే మన మిత్రుడు డాక్టర్ జవహర్ పుడుతూనే నలుగురినీ ఏడిపించాడు కానీ తాను మాత్రం ఏడవలేదు. అయితే పెద్దవాళ్ళు ఊరుకుంటారా? నాలుగు బాదులు బాది కెవ్వుమని ఏడిచాక అమ్మయ్య ఇక మనవాడికి డోకాలేదు అని సంతోషపడి సంబరాలు చేసుకున్నారు. అయితే ఈ సంబరాలు ఎంతోకాలం నిలువలేదు. మన జవహర్ కు అప్పుడప్పుడు జ్వరం రావడం, జ్వరంలో వళ్ళు బిసుగుపోతుండేది అది చిన్న పిల్లల చేష్టలంటూ పిల్లవాణ్ణి గాలిలోకి పైపైకి ఎగురవేస్తూ ఎగురవేస్తూ పట్టుకోవడాలు ఆ కుదుపులకు తట్టుకోలేక స్పృహ వచ్చి ఒక్కసారి పెద్దగా అరవడాలు ఇది పదే పదే పలుమార్లు జరుగుతుండటంతో చివరిగా ఇంటి ఎదురుగావున్న వీరాచారి వడ్రంగి కొలిమిలో పత్తిపుల్ల కాల్చి పిల్లవాని నుదురుమీద కాల్చేశారు. ఈ భయంకరమనైన భాధాకరమైన ట్రీట్‍మెంట్ తో నవమాసాలు మోసి కనిన ఆ మాతృ హృదయం ఎంత గిల గిలాడి పోయిందో కదా!


ఆ ఊరిలో ఒకే ఒక ఏకైక డాక్టర్ డాక్టర్ బందా జవహర్

బీద బ్రతుకుల అగచాట్ల దర్పణంగా ఉన్న ఈ దృశ్యంను, పరిస్థితులను వింటుంటే ప్రతి ఒక్కరి మదిలో అప్పటి చిన్ననాటి బీదలకు తమ స్వంత విషయాలను నెమరు వేసుకుంటూ ఏమి బతుకు ఏమి బతుకు ఇది చెడ్డ బతుకు... చెడ్డ బతుకూ.... అని ఈ మధ్య ఆదేశ్ రవి గారు పాడిన కరోనా పాట సయితం గుర్తుకొస్తుంది ఎవరికైనా! డాక్టర్ జవహర్ ఆ కుటుంబంలో అందరికన్నా చివరివానిగా పుట్టినా, ఇంటిలోనే కాక తను పుట్టిన ఊరి మొత్తానికీ మొదటి వానిగా నిలిచిపోయారు, డాక్టర్ కోర్స్ చేసి. అప్పటికీ ఇప్పటికీ ఆ ఊరిలో ఒకే ఒక ఏకైక డాక్టర్ మన మిత్రుడు డాక్టర్ జవహర్ మాత్రమే. ఇంతవరకు ఆ ఊరిలో డాక్టర్ కోర్స్ చేసినవారు ఎవరూ లేరు.


మాథ్స్ సబ్జక్ట్స్ లో పట్టు ఎక్కువ

డాక్టర్ జవహర్ కు మాథ్స్ సబ్జక్ట్స్ లో పట్టు ఎక్కువ నూటికి నూరు మార్కులు వస్తుండంతో తను ఇంజనీయర్ అవుదామనే ధృడ సంకల్పాన్ని విధి మెడిసిన్ చదివేట్లు చేసింది. కారణం డాక్టర్ జవహర్ అమ్మగారు కాన్సర్ అనే మహమ్మారికి లోనుకావడం. గర్భ సంచి కాన్సర్ తో పదునైదు సంవత్సరాలు పోరాడి చివరకు డాక్టర్ జవహర్ మెడికల్ ఫైనల్ ఇయర్ ఎక్జామ్స్ చివరి పరీక్ష రోజు చనిపోయారు.


డాక్టర్ జవహర్ కథ మరీ ప్రత్యేకమైనది

డాక్టర్ జవహర్ చదువులన్నీ బీదరికంలో సాగాయి. మెడిసిన్ చదువులు ఒకే ఒక ఏపరాన్, ఒకే ఒక పుస్తకము, మూడు జతల బట్టలు తో గుంటూరులొనే బియడ్ కోర్స్ చేస్తున్న వాళ్ళన్నయ్యకున్న మరో మూడు జతల బట్టలు కలుపుకొని జవహర్ మరియు వాళ్ళన్నయ్య ఇద్దరూ మార్చి మార్చి వాడుకునే వారు. ఒకరినొకరి బట్టలను మార్చుకుంటున్నారేమిటంటూ గేలిచేసిన కొందరి మిత్రుల మాటల తూటాల బాధలతో మరి ఒకే ఒక పుస్తకం తో ఎలా చదివావని అడిగితే, లైబ్రరీ పుస్తకాలతో మరియు రూమ్మేట్ పుస్తకాలతో, అదీ రూమ్మేట్ మిత్రుడు నిద్రపోతున్నపుడు లేదా బయటకు సినిమాలకు, షికార్లకు వెళుతున్నపుడు తన తోటి మిత్రునకు ఎటువంటి భంగం కలుగకుండా అని చదువు విషయాలలో ఆనాడు చేసిన డాక్టర్ జవహర్ అష్టావధానాలను చూస్తుంటే బీదరికమా పారిపో, ఎవరి వద్దకు రాకు అని అరవాలనిపించింది. ఇంటింటికీ ఓ కథ అయితే డాక్టర్ జవహర్ కథ మరీ ప్రత్యేకమైనది. ఓడలు బండ్లు కావచ్చు, బండ్లు ఓడలు కావచ్చు అని అంటుంటారు. ఇది విధి రాతలతో మారేది కాదు, మనకై మనం రాసుకున్న రాతలతో నే మారుతున్నది. డాంబికాలకు పోయి ఉన్న ఆస్తులన్నీ అరగదీసి బీదరికానికి వెళ్ళి సమాజంలో నవ్వులపాలు కావచ్చు, బీదరికం నుండి కఠోర శ్రమతో ఉన్నత స్థితికి చేరి నలుగురునుండి ప్రశంసలు అందుకోవచ్చు అనేది డాక్టర్ జవహర్ కథ చదివితే అర్ధమవుతుంది.


జీవిత గమ్యాన్ని మార్చిన కథ ఇక్కడినుండే ప్రారంభమైనది

డాక్టర్ జవహర్ మెడిసిన్ పూర్తి కాగానే 1980 సంవత్సరం నరసరావుపేటలో డాక్టర్ కోడెల శివప్రసాద రావు గారి వద్ద అసిస్టెంట్ గా చేరి, శస్త్ర చికిత్సకు సంబందించిన విషయాలన్నింటినీ డాక్టర్ కోడెల శివప్రసాద రావు గారి వద్ద నేర్చుకున్నారు. 1982 సంవత్సరం వినుకొండలో విశాలమైన ఒక లోగిలిని అద్దెకు తీసుకుని, రవీంద్ర హాస్పిటల్ అను పేరు పెట్టి డాక్టర్ కోడెల శివప్రసాద రావు గారితో ప్రారంభించిన కొద్ది రోజులలోనే మంచి ప్రాక్టిస్ లోకి వచ్చారు. నేను ఇక్కడ స్థానికుడను కావడంతో చుట్టు పక్కల గ్రామాలవారి పరిచయాలతో నా ప్రాక్టిస్ పెరిగింది అని నలుగురికి చెబుతుంటారు. తన వద్దకు వచ్చిన రోగులకు నాణ్యతా ప్రమాణాలతో కూడిన వైధ్య సేవలు అందిస్తున్న విధానాల వలన ప్రాక్టిస్ రోజు రోజుకూ మరింత విస్తరించడంతో డాక్టర్ జవహర్ అసలు సిసలైన కథ, తన జీవిత గమ్యాన్ని మార్చిన కథ ఇక్కడినుండే ప్రారంభమైనది చెప్పవచ్చు అది వివాహ రూపంలో.


తల్లి దండ్రులు

డాక్టర్ జవహర్ పుట్టిన తేది 25-07-1955 జన్మ స్థలం అగ్నిగుండాల గ్రామం, వినుకొండ తాలుకా, విద్య ఎం.బి.,బి.ఎస్., తల్లి దండ్రులు కీర్తిశేషులు శ్రీమతి సీతమ్మ, కీర్తిశేషులు శ్రీ సుబ్బారావు, డాక్టర్ జవహర్ కు మాధవి గారితో వివాహం 1982 లో జరిగినది. డాక్టర్ జవహర్ కు ముగ్గురు సంతానం పెద్దమ్మాయి ఇందిరాప్రియదర్శిని బిటెక్., పెద్దబ్బాయి డాక్టర్ రాకేష్ ఎమ్.ఎస్., (జనరల్) చిన్నబ్బాయి డాక్టర్ రాహుల్ ఎమ్.ఎస్., (ఆర్థో) అల్లుడు శ్రీ కిరణ్ ఎమ్.టెక్., పెద్ద కోడలు డాక్టర్ శారద ఎం.బి.,బి.ఎస్., డి.జి.ఒ., చిన్నకోడలు డాక్టర్ రమాలక్ష్మి ఎమ్.ఎస్., (జనరల్) ఉద్యోగరిత్యా అమ్మాయి అల్లుడు బెంగళూర్ లో నివాసం. డాక్టర్ జవహర్ కొడుకులు కోడళ్ళు ఐదుగురు డాక్టర్లు ఉమ్మడిగా ప్రాక్టిస్ చేసుకోవడానికి అనువుగా డాక్టర్ జవహర్ హాస్పిటల్ పేరుతో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణ దశలో ఉన్నది. అది మూడునెలల్లో పూర్తికాబోతున్నది. నలుగురు మనమరాళ్ళు, ఇద్దరు మనవళ్ళు ప్రాధమిక విద్య అభ్యసిస్తున్నారు.






విధ్యాభ్యాసం

డాక్టర్ జవహర్ ప్రాధమిక విద్య ఒకటి నుండి నాల్గవ తరగతి వరకు అగ్నిగుండాల ప్రైమరీ స్కూల్ లొ, ఐదవ తరగతి కారుమంచిలో, ఆరు నుండి పది తరగతుల వరకు వినుకొండ గవర్నమెంట్ హైస్కూల్ లో, ఇంటర్ మీడియట్ మొదటి సంవత్సరం వినుకొండ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ లో సీనియర్ ఇంటర్ నరసరావుపేట ఎస్ ఎస్ ఎన్ కాలేజ్ లొ, ఎం.బి.,బి.ఎస్., గుంటూరు మెడికల్ కాలేజ్ లో చదివారు. డాక్టర్ జవహర్ తండ్రి శ్రీ సుబ్బారావు గారు స్వాతంత్య సమరయోధులు, తన నలుబది ఎకరాల పొలమును దేశం కోసం, స్వరాజ్యం కోసం అమ్ముకున్న మహామనిషి, ఎక్కడ బ్రిటిష్ వ్యతిరేక ప్రదర్శనలున్నా తన జట్కా బండిపై ఊళ్ళు ఊళ్ళు తిరుగుతూ పాల్గొనేవారు., గాంధి, నెహ్రూ లతో కూడా ప్రదర్శనలలో పాల్గొన్నారు. పలుమార్లు జైలు కెళ్ళారు. ఇప్పటికీ శ్రీ సుబ్బారావు గారి ముఖచిత్రం గుంటూరు జిల్ల జైలులో ఉన్నది. మనకు స్వాతంత్ర్యం వచ్చిన తదుపరి ప్రభుత్వం వారు స్వాతంత్ర్య సమరయోధులకు గిఫ్ట్ గా ఇచ్చిన ఐదు ఎకరాల పొలాన్ని సయితం అమ్ముకొని అప్పట్లో రాష్ట్ర ముఖ్యమంత్రి గా ఉన్న శ్రీ కాసు బ్రహ్మానంద రెడ్డి గారి సమక్షంలో తోటి స్వాతంత్ర్య సమరయోధులకు సన్మానాలు చేయించారు. దీంతో కుటుంబ భారమంతా పెద్దబ్బాయి శ్రీ రఘురామారావుపై పడింది తను చేస్తున్న టిచర్ ఉద్యోగంపై అప్పట్లో నెలనెలా అరవై రూపాయల జీతంతో ఏడుగురు సభ్యులున్న కుటుంబమంతా ఖర్చులు పొదుపుగా వాడుకునేవారు.


చీమకుర్తిలో హాస్పటల్

డాక్టర్ జవహర్ మామగారు మంచి పేరు ప్రఖ్యాతులు గడించిన నేత్ర వైద్యులు డాక్టర్ ముక్కామల నరసింహారావు గారు. డాక్టర్ ముక్కామల నరసింహారావు గారికి రెండు హాస్పిటల్స్ ఉన్నవి ఒకటి ఒంగోలులో మరొకటి చీమకుర్తిలో అయితే చీమకుర్తిలో ఉన్న హాస్పటల్ బాధ్యతలన్నీ డాక్టర్ జవహర్ ను తీసుకోమని కోరారు. అప్పటికే వినుకొండలో మంచి ప్రాక్టిస్ లో ఉన్న డాక్టర్ జవహర్ కొంత సందిగ్ధంలో నెమ్మదిగా ఆలోచించి, డాక్టర్ జవహర్ వారి అన్నయ్యలకు ఇష్టంలేక పోయినా నచ్చజెప్పుకొని, చీమకుర్తిలో హాస్పటల్ బాధ్యతలను తీసుకున్నారు. అయితే చీమకుర్తిలో హాస్పటల్ లో డాక్టర్ జవహర్ కు ప్రాక్టిస్ అంతగాలేదు రోగులు రావడమే కరువయ్యారు. పేషంట్స్ వచ్చినా రాకపోయినా డాక్టర్ జవహర్ ఉదయం ఎనిమిది గంటల నుండి సాయంత్రం ఎనిమిది గంటల వరకు హాస్పటల్ లోనే కూర్చోవడం, పేద పేషంట్స్ ఎవరైనా వస్తే ఉచిత వైద్య సేవలందించడం, ఏదైనా పుస్తకాలను చదువుకోవడం అలవాటుగా మార్చుకున్నారు. క్రమ క్రమంగా ప్రాక్టీస్ పుంజుకోవడం మొదలయింది. మంచి డాక్టర్ అని చుట్టుపక్కల గ్రామాలనుండి పేరు వచ్చింది. ఇక వెనుకకు చూసుకోవలసిన అవసరంలేకుండా పోయింది. చీమకుర్తి నుంచే కాక చుట్టుపక్కల గ్రామాలనుండి పేషంట్స్ రావడం మొదలు పెట్టారు. చీమకుర్తిలో అడుగు పెట్టిన కొద్ది కాలంలోనే డాక్టర్ జవహర్ అతి మంచి ప్రాక్టిస్ ఉన్న వైధ్యునిగా పేరు తెచ్చుకున్నారు


కేంద్ర ప్రభుత్వం నుండి అవార్డ్

డాక్టర్ జవహర్ వైధ్య వృత్తిలో పేద ప్రజలకు ఉచిత సహాయ సహకారాలందించడమే కాకుండా అనేక సేవా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొని చీమకుర్తి చుట్టుపక్కల గ్రామవాసులందరకీ, ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పోలీస్ శాఖ వారికి ఆదర్శప్రాయులైనారు. క్షణికావేశంతో తప్పు చేసి శిక్షలు అనుభవిస్తున్న ఖైదీలు మానసిక పరివర్తన చెందటానికి, శిక్ష నుండి బయట పడగానే తనకు తానుగా స్వతంత్రంగా బ్రతకటానికి ఏ జిల్లా జైలుకు లేని అనేక శిక్షణా యూనిట్ల సదుపాయాలను ప్రకాశం జిల్లా జైలుకు కల్పించారు. వాటిలో సొలార్ బ్రెడ్ మేకింగ్ యూనిట్, బుక్ ప్రింటింగ్ మేకింగ్ యూనిట్ వంటి అనేకం ఉన్నాయి. రెండు ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ఉన్న తమ హాస్పటల్ ప్రాంగణంలో ముప్పది మంది అంధ విధ్యార్ధులతో గురుకుల పాఠశాలను ఏర్పాటు చేసి బోజనము, బట్టలు, హాస్టల్ సౌకర్యాలతో పూర్తిగా ఉచితంగా ప్రాధమిక విద్య నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు విద్యలందిస్తున్న డాక్టర్ జవహర్ సేవలకు విజయశ్రీ అవార్డ్ తో కేంద్ర ప్రభుత్వం నుండి ప్రశంసలందుకున్నారు. పేదల డాక్టర్ జవహర్ అని జెమినీ టీవి వారు ఒక డాక్యుమెంటరీని ప్రసారం చేశారు. డాక్టర్ జవహర్ గురుకుల అంధ పాఠశాలలో చదివిన చాలామంది విధ్యార్ధులు గ్రూప్ వన్ సెలక్ట్ కావాడం అక్కడి విధ్యా ప్రమాణాల ఉన్నతిని తెలిజేస్తున్నది. దీనికి ప్రతి రోజూ జవహర్ సతీమణి శ్రీమతి మాధవీ దగ్గరుండి అంధ విధ్యార్ధుల బాగోగులన్నీ చూడడంతో సాధ్యమయిందని చెప్పవచ్చు. శ్రీమతి మాధవీ గారు విజయవాడ మెరిస్టెల్లా కాలేజ్ లో డిగ్రీ చేశారు.


జన విజ్ఞాన వేదిక గౌరవ అధ్యక్షులు

డాక్టర్ జవహర్ ప్రకాశం జిల్లా క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్‍గా, ఆలోచనధార మరియు రాష్ట్ర జన విజ్ఞాన వేదిక లలో అనేక పదవులను నిర్వహించారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లా జన విజ్ఞాన వేదిక గౌరవ అధ్యక్షులుగా కొనసాగుతున్నారు


డాక్టర్ జవహర్ హాస్పటల్

ఒక కుగ్రామంలో, వైధ్య లేమితో కునారిల్లుతున్న అగ్నిగుండాల అను పల్లెటూరిలో పుట్టి మొరటు వైధ్యాలతో బతికి బట్టకట్టి డాక్టర్ గా అతి చిన్న వయసులొనే మంచి మెడికల్ ప్రాక్టిషనర్ గా ప్రజలనుండి గుర్తింపు పొంది, నేను అనుభవించిన కష్టాలు ఎవరికీ రాకూడదు అనే తలంపుతో బీదవారికి ఉచితంగా వైధ్యాన్ని అందిస్తూ, ఉచిత అంధ గురుకుల పాఠశాలను నడుపుతూ, ప్రకాశం జిల్ల జైలు ఖైదీలను సయితం పరామర్శిస్తూ, జైలు శిక్షలు పూర్తయి బయటపడగానే వారు తమంతటతాముగా జీవితంలో స్వతంత్రంగా జీవించడానికి కావలసిన యూనిట్ల సదుపాయాలను, శిక్షణలను అందిస్తూ, నేడు అతి పెద్ద మల్టీ హాస్పటల్ డాక్టర్ జవహర్ హాస్పటల్ అధినేతగా ఎదిగిన డాక్టర్ జవహర్ గారి జీవితం అభినందనీయం.


బయోగ్రఫీ వివరాల కొరకు ఈ క్రింది మిత్రుల ముఖ చిత్రాల బానర్స్ పై క్లిక్ చేసి, సంబదిత బయోగ్రఫీ లను చదవ వలసినదిగా కోరుచున్నాను. బయోగ్రపీ సంబందించిన మాటర్ ను నేను వీడియో రూపంలో కూడా రికార్డ్ చేసి యూట్యూబ్ బండ్ల ఛానల్ లో అప్‍లోడ్ చేసిన వీడియోను ప్రతి బయోగ్రఫీ పేజీలో పబ్లిష్ చేస్తున్నాము. www.bandla.app పాఠకులకు బయోగ్రఫీలను చదవడానికి, వీక్షించటానికి లేదా వినడానికి ఏది సౌలభ్యంగా ఉంటే అది ఫాలో కావటానికి రికార్డ్ చేసిన బయోగ్రఫీ మాటర్ వీడియో ను ప్రతి బయోగ్రఫీ పేజీలో జత చేస్తున్నాము.


Prof DAR Subrahmanyam
Mr VSR Avadhani
Mr Syed Naseer Ahamed
Dr Tata Seva Kumar
Mr PV Uma Maheswara Rao
Dr K Naga Malleswara Rao
Mr Dasari Rama Muthy
Mr Gaddapati Srinivasu
Mr Kanuparti Surendranath
Mr Kareti Sai Krishna
Mr Linga Rao
Mr Nallapati Satyanarayana
Mr Prasad Sarma
www.bandla.app Image
www.bandla.app Image
www.bandla.app Image